Sunday, 24 September 2023

విరుదాచలం లేదా వృద్ధాచల క్షేత్ర సందర్శనానుభవాలు

చిన్నతనం నుండీ పలు దేవాలయాల సందర్శనం నాకు అమిత ఆనందాన్ని కలిగించేది. ఆలయాల సందర్శనం వలన కలిగే మానసిక ప్రశాంతత,  అలౌకిక ఆనందం వర్ణనాతీతం. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మనలో ఏదో తెలియని శక్తి ప్రేరేపితమైన భావన నాలో చాలాసార్లు కలిగింది. ఈ ఆలయ సందర్శనమనే సద్గుణం మా తల్లిదండ్రుల నుండి నాకు సంక్రమించిందనే చెప్పాలి.

మన భరతభూమిలో అడుగడుగునా గుడి వుంది. ప్రతీ ఆలయమూ ఒక విశిష్టతనూ, ప్రత్యేకతనూ కలిగివుంటుంది. అందునా దక్షిణ భారతాన ఆలయాలు చాలా విశాలమైన ప్రాంగణాలతో, ఎత్తైన గోపురాలతో, సనాతన వైదిక ఆచారాలచే పూజాదికాలు నిర్వహింపబడుతూ, చక్కని శిల్పకళతో అలరారుతూ వుంటాయి. 

అలాంటి ఒక అత్యంత పురాతన మహిమాన్విత ఆలయమైన *విరుదాచలం లేదా వృద్ధాచలం* ఆలయాన్ని ఈ మధ్యనే సందర్శించే భాగ్యం మాకు లభించింది. 

తమిళనాడులోని సేలం పట్టణం నుండి 135 కి.మీ.ల దూరంలో సేలం-చిదంబరం జాతీయ రహదారిపై వున్న ఈ ఆలయం కాశీ క్షేత్రం కన్నా అత్యంత పురాతనమైనది మరియు పవిత్రమైనదని ప్రతీతి. వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. స్థలపురాణం ప్రకారం బ్రహ్మ సృష్టి ప్రారంభంలో ముందుగా జలాన్ని సృష్టించి, జీవకోటి మనుగడకు కావలసిన భూభాగాన్ని అందించవలసినదిగా పరమేశ్వరుని ప్రార్థించాడు. అందుకు ఈశ్వరుడు సమ్మతించి ఒక గిరి రూపంలో ఇక్కడ వెలిసాడట. ఈ క్షేత్రాన్ని మొదట పళమలై అని పిలచేవారు. తదనంతరం విరదాచలంగా ఖ్యాతి పొందింది. చిదంబరంలో పరమేశ్వరుడు కాళితో పోటిపడి నాట్యం చేస్తే, ఈ విరుదాచలం లేదా వృద్ధాచలంలో విరుదాచలేశ్వరుడు గా ప్రఖ్యాతుడైన ఈశ్వరుడు తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అనగా స్వామి సంతోష తరంగాల్లో తేలిపోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇది. కనుక ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు మనఃక్లేశాలు తొలగిపోయి, వారి జీవితం ఆనందమయం అవుతుంది.

ఇక్కడ స్వామివారిని సేవిస్తే కాశీలో విశ్వనాథుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని  ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలు కుదరని వారు ఇక్కడికి వచ్చి ఈ స్వామి సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం వృద్ధకాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో  జన్మించినా, నివసించినా, మరణించినా, పూజించినా మరియు ఈ క్షేత్ర మహిమ తలచుకొన్నా ముక్తి లభిస్తుంది. కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక అమ్మవారు తన చీర కొంగుతో విసురుతూ ఉండగా, వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అంతేకాక మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ అమ్మవారిని పూజిస్తే, వృధ్ధాంబిక అమ్మవారు వారి కోరికలు తీరుస్తుందని ప్రతీతి. ఇందుకు నిదర్శనంగా నా మిత్రుని వృత్తాంతం మనవిచేస్తాను. నా మిత్రుడు ఒకరు తీవ్రమైన హృద్రోగంతో బాధపడుతూ, వైద్యలంతా పెదవి విరిచిన సమయంలో అతని సతీమణి వృద్ధాంబికను తన భర్త ప్రాణాలు కాపాడమని, బదులుగా తన తాళిబొట్టును అమ్మవారికి సమర్పించుకుంటానని, మరలా తాళిని ధరించనని మొక్కుకున్నారు. అంతే, వైద్యలోకం ఆశ్చర్యపోయే రీతిగా నా మిత్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. అతని సతీమణి మొక్కుకున్న విధంగా ఇప్పటికీ మెడలో పసుపుకొమ్ము మటుకే ధరించివున్నారు. అమ్మవారి మహిమలు తెలియజేసే ఇలాంటి వృత్తాంతాలు ఈ ప్రాంతంలో కోకొల్లలు.

*చేసుకున్నవారికి చేసుకున్నంత* అనే లోకోక్తి ప్రసిద్ధమైనది ఇక్కడే ఉద్భవించింది. పూర్వం ఈ ప్రాంత ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్ట కష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, విరుదాచలేశ్వరునికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు. దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామివారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం కలిగింది. దీనికి విభాసిత మహర్షి, వృద్దేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పని చేయండి, చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు అయిష్టంగానే 

ఆ పనికి పూనుకొన్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి 

విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న వణ్ణి వృక్షం నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.ఆశ్చర్యంగా ఆ ఆకులు బంగారు నాణ్యాలుగా మారేవి. ఎవరెవరు ఎంతెంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసుకున్నవారికి చేసుకున్నంత అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు. సుందరార్ అనే పరమ శివభక్తుడు స్వామిని కీర్తిస్తూ అనేక వేల కృతులను గానం చేసాడట. అందుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు సుందరార్ నకు 12000 బంగారు నాణాలను అనుగ్రహిస్తారు. అయితే సుందరార్ తోవలో దొంగల భయం గురించి విన్నవించుకోగా, స్వామి ఆ నాణాలను ఆలయ సమీపంలోని మణిముత్తార్ నదిలో పడవేసి, వాటిని అతని స్వగ్రామమైన తిరువారూర్ లోని చెఱువులో పొందవచ్చని వరమిస్తారు. స్వామి చెప్పిన విధంగానే సుందరార్ నకు అతని గ్రామ చెఱువులో ఆ నాణాలు దొరికాయట. ఆనాటి నుండి "నదిలో పడేసుకొని, చెఱువులో వెదకటం" అనే నానుడి పుట్టింది.

ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు ఐదుగురు - వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఈ ఆలయంలో స్వామివారికి ఐదు పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పళమలైనాథార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు. అలాగే ఈ ఆలయానికి ఐదు ప్రాకారాలు, ఐదు గోపురాలు, ఐదు నందులు, ఐదు ధ్వజస్తంభాలు, ఐదు మంటపాలు, ఐదు రథాలు వున్నాయి. అంతేకాకుండా స్వామివారికి ప్రభాత సమయం నుండి పవ్వళింపు సేవ లోపల ఐదు సార్లు నిర్ణీత సమయంలో పూజాధికాలు నిర్వహిస్తారు. 

శైవ సిద్దాంతం ప్రకారం ఈ ఆలయంలో 28 ఆగమ శాఖలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిద్ధాంతాలకు ప్రతీకగా 28 శివలింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని ప్రతీతి. ఈ సిద్ధాంతాల వల్లే ఈ ఆలయానికి ఆగమ ఆలయమని పేరు వచ్చింది. ఈ విశేషం ఉన్న ఆలయం మన దక్షిణాన ఇదొక్కటే. 

ఈ అలయ ప్రధాన మంటపం రథం వలె దర్శనమిస్తుంది. ఇక్కడ వున్న మరొక ప్రత్యేకత పితృదోషం వున్నవారు ఈ ఆలయ ప్రాంగణంలో గల వణ్ణి వృక్షం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే, దోషాలన్నీ తొలగిపోయి, పితృదేవతలు సంతుష్టులౌతారని నమ్మకం. ఆ వణ్ణి వృక్షం క్రింద వశిష్ఠ, విభాసిత తదితర మహర్షుల విగ్రహాలు వున్నాయి. అరుణాచలం (తిరువణ్ణామలై) లో గిరి ప్రదక్షిణం చేసే విధంగానే ఇక్కడ కూడా ప్రతీ పౌర్ణమికి భక్తులు వేల సంఖ్యలో గిరి ప్రదక్షిణలు చేస్తూవుంటారు.

అత్యంత విశాలమైన ఈ విరుదాచల ఆలయాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మరియు మహిమలు పొగడటం చతుర్ముఖ బ్రహ్మకు కూడా సాధ్యం కాదనటం అతిశయోక్తి ఏమాత్రం కాదు.

మైసూరుకి తిరుగు ప్రయాణంలో సేలం సమీపంలోని ఎత్తాపూర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన 146 అడుగుల ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని తిలకించాము. ఇది కౌలాలంపూర్ లోని విగ్రహం కన్నా 10 అడుగులు ఎత్తైనది మరియు ఆ శిల్పి చేతనే నిర్మింపబడింది.

మార్గమధ్యంలో నమక్కల్ క్షేత్రంలో కొలువైవున్న అత్యంత ఎత్తైన ఆంజనేయుని సేవించుకున్నాము.  మా మరువలేని యాత్రానుభవాలను నెమరు వేసుకుంటూ కారుని మైసూరు రహదారిలో పరుగెత్తించాము.

                                         యజ్ఞమూర్తి ద్వారకానాథ్